నేరం

జంతువును కాపాడబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి!

UP Road Accident: ఈమధ్య కాలంలో ప్రతీరోజూ దేశంలోని ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. రెండ్రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ జంతువును తప్పించబోయి ముందు వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందో కారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలు కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్ పూర్ జిల్లా నవాడా నాగ్లా బన్వారీ గ్రామానికి చెందిన 40 ఏళ్ల రియాసత్ అలీ బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఓ వివాహ వేడుకకు హాజరు అయ్యేందుకు కారులో బయలుదేరాడు. ఆయనతో పాటు ఆయన భార్య ఆమ్మా బేగం (38), కుమార్తెలు గుడియా(6), ఖుషి (10), కుమారుడు సుభాన్ (7)లను కూడా వెంట తీసుకువచ్చాడు. అంతేకాకుండా వారితో పాటు వాళ్ల బంధువులను కూడా పెళ్లికి తీసుకు వెళ్లాలనుకున్నారు.


ఈక్రమంలోనే ఎటా జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను కూడా అదే కారులో ఎక్కించుకున్నాడు. బంధువులంతా కలవడంతో హాయిగా మాట్లాడుకుంటూ.. పెళ్లికి వెళ్తున్నారు. అయితే కారు మదనాపూర్ ప్రాంతంలోని బర్ఖేడా జైపాల్ గ్రామ సమీపానికి రాగానే… కారుకు అడ్డంగా ఓ జంతువు వచ్చింది. అది అటూ అటూ తిరగడం గమనించిన రియాసత్ అలీ దాన్ని తప్పించబోయాడు. ఒక్కసారిగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. అదే వారి పాలిట యమపాశంగా మారింది.


జంతువను తప్పించబోయి పక్కకు స్టీరింగ్ తిప్పగా.. ఎదురుగా ఓ ట్రక్కు వస్తోంది. నేరుగా వెళ్లి కారు ఆ ట్రక్కును ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయింది. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అక్కడకు వెళ్లి కారులో ఉన్న వాళ్లను కాపాడే ప్రయత్నం చేశారు. అలాగే పోలీసులకు కూడా ఫోన్ చేశారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. క్షతగాత్రులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లేలోపే రియాసత్ అలీ, ఆయన భార్య ఆమ్మా బేగం, కూతురు గుడియా, బంధువులలో ఒకరైనా అన్ను, ఆమె కూతురు నూర్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

మరో ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉందని.. అయితే వారందరికీ ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని పోలీసులు వివరించారు. ముఖ్యంగా రోడ్డుకు దగ్గర్లో పొలాలు ఉండడంతో.. జంతువులు విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నాయని… ఎన్ని చర్యలు తీసుకున్నా వాటిని ఆపలేకపోయామని చెప్పారు. ఇకపై కఠిన చర్యలు తీసుకుని.. రోడ్డుపైకి జీవరాశులు రాకుండా చేస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button